దీనికి సులువైన పరిష్కారం లభించాలని ఆశిస్తున్నాను. మీకు పరిష్కారం లభిస్తే నాకూ తెలియచేయండి సాబ్! ఈ విషయం గురించి నేను ఒక పుస్తకం వ్రాసాను. ‘ద విజ్డమ్ బ్రిడ్జ్’. ఇది 2012లో మొదలయ్యింది. కుటుంబ జీవితం గురించి వ్రాయాలనే ఆలోచన 2012లో నాకు కలిగింది. పిల్లల్ని పెంచడం, తల్లిదండ్రుల, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మల పాత్ర గురించి… ఇంకా సమాజంలోని ఇతర స్నేహితుల పాత్ర గురించి వ్రాయడం జరిగింది.
నా స్నేహితులలో ఒకరి అమ్మాయి నేను చెన్నైలో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చింది. నేను తనను ‘అమ్మాయీ, నీవు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?’ అని అడిగాను. ఆ అమ్మాయికి అప్పటికి 26 లేక 27 సంవత్సరాలు ఉండవచ్చు. నీవు పెళ్లి చేసుకోవటానికి, ఇది సరైన సమయం అన్నాను. ఆమె ‘అంకుల్! నేను 32, 33 సంవత్సరాలు వయస్సు వచ్చాక పెళ్లి చేసుకుంటాను’ అన్నది. మంచిది! నేనప్పుడు ఆమెను తరువాతి ప్రశ్న ‘నీవు మీ కుటుంబంలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు?’ అని అడిగాను. ఆమె ‘మా నాన్నమ్మను’ అని చెప్పింది. వెంటనే నేను తరవాత ప్రశ్న అడిగాను. మరి నీవు పిల్లల్ని పొందేసరికి వారికి తాత, నానమ్మలు మిగిలి ఉంటారా?
నీవు 33 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటావు. భగవంతుడు కరుణిస్తే బహుశా నీకు పిల్లలు కలిగేసరికి 34, 35 సంవత్సరాలు వస్తాయి. నీవు ఇంకా ఆలస్యం చేస్తే నీకు నీ స్వంత బిడ్డలు ఉండకపోవచ్చు కూడా.
అప్పుడు ఇతరుల బిడ్డలను దత్తత తీసుకోవలసిన పరిస్థితి రావచ్చు. నీకు 35 సంవత్సరాల వయస్సులో బిడ్డ కలిగితే ఆ బిడ్డకు యుక్త వయస్సు వచ్చేసరికి నీకు మెనోపాజ్ సమయం వస్తుంది.
ఇంట్లో యుక్త వయసులోని పిల్లలు cహార్మోన్ల ప్రభావంతో కోపంగా ఉంటే… నీవేమో మెనోపాజ్ ప్రభావంతో చిరాకు, ఒత్తిడి లాంటి వాటితో ఉంటే ఆ ఇంటి వాతావరణానికి ఏం జరుగుతుంది?
ఇల్లంతా పూర్తిగా గందరగోళంతో నిండిపోతుంది. ఆపై నీ బిడ్డకు కొంత ఓదార్పు అవసరమవుతుంది.పెద్దవాళ్లు లేకపోతే ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరి జీవితంలోనైనా తాతయ్య, నానమ్మలు చాలా ముఖ్యమైన వారు.
పిల్లలే తల్లిదండ్రులతో కలిసి జీవించటం లేదు అంటున్నారు. తాతయ్య నానమ్మల విషయం ఇక చెప్పేదేముంది?
ఇంకొక ఉదాహరణ నేను ఆమెతో పంచుకున్నదేమిటంటే, తాతయ్య, నానమ్మ లేనప్పుడు మాటలతో చెప్పకుండానే వారందించే ఈ వివేకం… సక్రమంగా ఎలా కూర్చోవాలి? ఎలా భుజించాలి? ఎలా మాట్లాడాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? లాంటివేమీ వారు నేర్చుకోలేరు. మీ కుటుంబ నేపథ్యం జైన్, సిఖ్, ముస్లిం లేక హిందూ ఏదైనా కావచ్చు. కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వాళ్లు పిల్లలకు అందిస్తారు. ఈ క్రమశిక్షణ నేర్చుకోవడం ఆగిపోతుంది.
వారు మన మనస్సును క్రమశిక్షణలో పెడతారు. ఉద్దేశ్యం ఒక్కటే, భగవత్ సాక్షాత్కారం… క్రమశిక్షణ వేరు వేరు. ఏం ఫర్వాలేదు. మనం అన్నిటినీ గౌరవిస్తాం. దీనికి ఉదాహరణ అమెజాన్ అడవులు. చాలామంది యువత అడవులను వదిలి పెద్ద పెద్ద నగరాలకు తరలిపోతున్నారు. ఈ గ్రామాలన్నీ వృద్ధులతో మిగిలిపోతున్నాయి. ఈ పెద్దవాళ్లు వాళ్ళ తల్లిదండ్రుల నుండి, తాత ముత్తాతల నుండి అందుకున్న జ్ఞానాన్ని కలిగి ఉంటారు.
ఈ గ్రామాల్లో యువత లేకపోతే వారు ఏ విధంగా ఆ జ్ఞానాన్ని అందించగలరు? అసాధ్యం! మానవాళి అంతా కూడా తీవ్రమైన ప్రమాదం వైపు అడుగులు వేస్తోందని నేను భావిస్తున్నాను. ఒక తరం నుండి వేరొక తరానికి అందించబడని ఏదైనా కానీ సంపూర్ణంగా కోల్పోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన జాడ కూడా తెలియకుండా పోతుంది. కొన్ని విషయాలు గూగుల్ నుండి ఇంటర్నెట్ నుండి నేర్చుకోలేము. గూగుల్ నుండి ఇంటర్నెట్ నుండి ఎవరైనా ఏదైనా మంచిని నేర్చుకుంటున్నారా అనేది నాకు సందేహమే. చాలా చెడ్డ విషయాలను వారు నేర్చుకుంటున్నారు. వారి స్వంత గదులు వారి శత్రువులుగా మారాయి. ఈ రోజుల్లో చాలామంది బయటి ప్రపంచం చాలా చెడ్డగా ఉంది అంటారు. రాత్రి 9 గంటల తర్వాత నా కుమార్తెను బయటికి పంపను, అంటారు. నేను అంగీకరిస్తాను. అయితే ఆమె స్వంత గదిలోనే ఎన్నో అపాయాలు ఎదురుచూస్తున్నాయి. ఆ గదిలో ఆమె ఒంటరిగా ఏం చేస్తోందో, ఏం చూస్తోందో మీకు తెలియదు. స్వాతంత్ర్యాలు లభించాక, ప్రాథమిక, నైతిక పునాది నాశనం అయిపోతుంది. స్వార్థపరులుగా తయారవుతారు, అహంకారులవుతారు. ఆ పని చేయవద్దని చెప్తే, మీరు వారికి శత్రువులు అవుతారు. కుటుంబం నుంచి దూరంగా పారిపోవడానికి వారి విపరీత స్వార్ధపరత్వమే మరొక కారణం. కొంతవరకు పెద్దలను కూడా ఇందులో నిందించాలి. అడగకముందే వారికి అన్ని రకాల ఫ్యాన్సీ వస్తువులను కొని పెట్టేస్తాం.
మనం వారిని ఫోన్ వాడవద్దని చెబుతాం. మనం వాడుతూనే ఉంటాం. నిద్రించే ముందు ఫోనుని దిండు క్రింద పెట్టుకుంటాం. మరి వాళ్ళని వాడవద్దని ఎలా ఒప్పించడం? స్వచ్ఛమైన, సరళమైన జీవన ప్రమాణాల్ని ఎలాగో నెలకొల్పినప్పుడే… పెద్దలు పిల్లలను భజన కానీ, నమాజ్ కానీ లేదా ధ్యానం కానీ ఇంట్లో కలిసి చేయడానికి వారిని ప్రోత్సహించాలి. అటువంటి వాతావరణాన్ని సృష్టించినప్పుడే వారు నేర్చుకుంటారు.
ఒకరోజు పిల్లలు బయట ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినా, ఇంటి వాతావరణం మిస్ అవుతున్నామని అనుకోగలగాలి. నా తల్లిదండ్రులతో, అక్కాతమ్ముళ్లతో కలిసి నేను పూజ, ధ్యానం చేయాలి, అనుకోవాలి.
కాబట్టి నా దృష్టిలో ఆధ్యాత్మికతే ఒక కుటుంబాన్ని దృఢంగా పట్టి ఉంచగలదు. ఒక పని చేయకముందే, ఆ చర్య తాలూకు ప్రభావాన్ని ముందుగానే కళ్ళు మూసుకొని గమనించవచ్చు. అప్పుడు బహుశా మనం ఆ పని చేయకుండా ఆగవచ్చు కూడా! తల్లిదండ్రుల నుంచి దూరంగా పారిపోవడం గురించి ఆలోచించండి. ఒకసారి నేనొక విషాదాన్ని గమనించడం జరిగింది. వాళ్లు మన అభ్యాసులు అయినందువల్ల వారి పేర్లు ఇక్కడ చెప్పలేను. నా స్వంత కుటుంబంతో సంబంధం ఉన్న కుటుంబంలోని… కొత్త కోడలు, పెళ్లయిన రెండు రోజులకే ‘మెట్టినింట్లో ఉండను’ అనేసింది. ఏం జరిగిందని అడిగితే నా భర్తతో కలిసి ఉంటాను కానీ, అతని తల్లిదండ్రులతో కలిసి ఉండలేనని బదులిచ్చింది. అందులో తప్పేముందని నేను అడిగాను. నీవు వంట చేయక్కర్లేదు. సుఖంగా ఉండొచ్చు కదా! అన్నాను. లేదు, లేదు నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలి’, అన్నది. మరింక పెళ్ళెందుకు?
కాబట్టి ఇది మనోవైఖరికి సంబంధించినది. ప్రస్తుతం అనే కాదు, 1948లో మా గురువర్యులు ఒక అభ్యాసీకి ఉత్తరంలో ఇలా వ్రాశారు. కొత్త కోడలు మెట్టినింటికి వచ్చేటప్పుడు ప్రధాన సమస్య ఇరువైపులా ఉంటుంది.
సాంగత్యం…! ఈ సాంగత్యం అనేది ఏర్పడే వరకు, ఆమె ఆ ఇంటిలో ఒక అతిధి లాగే ఉంటుంది. సంతోషంగా ఉండదు. అన్యోన్యత ఇరువైపుల నుండి పెంపొందాలి. ఈమె నాకు కోడలు మాత్రమే కాదు, కూతురు కూడా అనుకోవాలి.
అలాగే కోడలు కూడా ‘ఈ కుటుంబం ఇకనుంచి నాది’ అని అర్థం చేసుకుని ప్రేమించాలి. ఆమె అలా చేయలేకపోతే, దయచేసి పెళ్లి గురించి తలపోయవద్దు.