జీవితంలోని రంగులన్నింటినీ స్వాగతించడమే హోలీ!

హోలీ మన జీవితాల్లో ఉత్సాహం, ఆనందం, ఆశ, ఆకాంక్ష, ఐక్యత, దాతృత్వం, పరివర్తన అనే ఏడు రంగులను కలుగజేసే ఒక పండుగ. ఈ సప్తవర్ణాల శోభితం వల్లే మనం ఈ పండుగను ప్రేమోత్సవం, రంగుల పండుగ లేదా వసంతోత్సవం అని కూడా పిలుచుకుంటాం. మరి ఈ పండుగ ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా?

ప్రాచీన భారతీయ గ్రంథాల ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశిపుని సోదరి హోలిక, బాలుడైన ప్రహ్లాదుని చంపడం కోసం ఉద్దేశించబడిన అగ్నిలో, ఈరోజునే దహించబడిందని విశ్వసిస్తారు. రాక్షస రాజు యొక్క దుష్ట, క్రూర ఉద్దేశాలు ఆ చితి మంటలు, బూడిదలో అంతమైనాయని అప్పటినుండి హోలీ బాహ్య, అంతరంగాల చెడుస్వభావ అంతానికి ప్రతీకగా భావిస్తారు.

అయితే ఈ సంవత్సరం ఈ రంగుల పండుగను విభిన్న దృక్కోణంలో గమనిద్దాం. మన ప్రపంచంలో కేవలం తెలుపు నలుపు అనే రెండు రంగులు మాత్రమే ఉంటే ఎలా ఉంటుందో ఒక్క క్షణం ఊహించండి. ప్రకృతి మనకు ప్రసాదించిన వేనవేల రంగులను ఆస్వాదించే మనం, అటువంటి నిస్సారమైన ప్రపంచంలో ఉండడాన్ని ఊహించలేం కదా!

ఈ జీవన ప్రయాణం మనకు బోధించడానికి, అనుభూతి చెందడానికి ఎంతో కల్పిస్తున్నది. అయితే మనం మన మనసులలో ఈ తెలుపు –  నలుపు అనే ద్వంద్వ ప్రపంచంలో చిక్కుకున్నాం. మన జీవితాలలో మంచి-చెడు; ఒప్పు-తప్పు; సరళం-సంక్లిష్టం; ధనిక-పేద; విజయం-అపజయం ఇలా కొనసాగే జాబితాలో చిక్కుకుపోయాం. నిరంతరం ఈ అంతర్గత సంఘర్షణలో తల మునకలవుతున్నాం. ఈ విపరీత పోకడల మధ్య కొనసాగుతూ, ‘వాటి మధ్యలో’ జీవితం అందించే అనేక ఇతర అందమైన ఛాయలను, రంగులను చూడడంలో విఫలమవుతున్నాం.

ఈ రంగులకు వాటి ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉండడమే కాక, ఇవే మన జీవితాలకు జీవం పోస్తాయి. కాబట్టి వీటిని స్వీకరించి ఇవి మన వికాసానికి, ఎదుగుదలకు ఏం అందిస్తాయో పరిశీలిద్దాం. తెలుపు రంగు కాంతి కూడా రంగుల వర్ణపటం నుంచే ఉద్భవిస్తుంది. లక్ష్యాన్ని అందుకోవడానికి జీవితంలో అనేక రంగుల గుండా మనం ప్రయాణించాలి. కాబట్టి మన చేతుల్లో లేనిదాన్ని సంతోషంగా అంగీకరించడం నేర్చుకుందాం. పరిణామానికి, అభివృద్ధికి, ఉన్నత వివేకానికి చిహ్నం అంగీకారమే! అంగీకారమనేది జీవితాన్ని సంతోషకరంగా తయారు చేస్తుంది. జీవితం అందించే రంగుల అవకాశాల్ని స్వాగతించడమే దీని ఉద్దేశం.

కాబట్టి ప్రతిక్షణం మనకు ఛాయిస్ ఉంటుంది. వర్తమానాన్ని ఉల్లాసంగా అంగీకరించి మన లక్ష్యం దిశగా పనిచేయడం లేదా మనం  అసంపూర్ణ వర్తమానంలో ఉన్నామని భావిస్తూ అసంతృప్తితో రగిలిపోవడం. మన మార్గాన్ని తెలివిగా ఎంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. మన హృదయాల్లో ఈ అంగీకారానికి స్థానం ఇచ్చినప్పుడు, ప్రపంచంలోని అన్ని రంగులు వ్యక్తీకరించబడతాయి. కనుక మనం వర్తమానాన్ని సంతోషంగా అంగీకరించడం అనేది ఒక పెద్ద ముందడుగు. ఇది మనకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తుంది.

నా గురువర్యులు చారీజీ మహరాజ్ ఇలా అనేవారు. “యోగా లోని ప్రాథమిక శిక్షణ మిమ్మల్ని మీరు అంగీకరించడాన్ని నేర్చుకోవడమే! మనల్ని మనం ఎక్కువా చేసుకోకూడదు, తక్కువా చేసుకోకూడదు. మనం యోగ శాస్త్రంలో సత్ తత్వంతో వ్యవహరిస్తాం కాబట్టి మనం నిజాయితీగా అంగీకరించగలగాలి.”

కనుక ఈ హోలీ సందర్భంగా మన హృదయాలలో అంగీకారం అనే విత్తనాలు నాటుదాం. అలాగే జీవితం అందించే అన్ని రంగులతో మనల్ని ముంచెత్తనిద్దాం. మనల్ని మనం మార్చుకోవడానికి, మనలోని చెడును అంతమొందించడానికి ముందుగా మనం అసంపూర్ణ వ్యక్తులమని, ఈ జీవన ప్రయాణంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అంగీకరిద్దాం. ఇటువంటి అంగీకారంతోనే సగం పని పూర్తయినట్లు. మిగిలిన సగాన్ని మనం ధైర్యం, సంకల్పం, పట్టుదలతో పూర్తి చేస్తాం.

అందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు.

Share this post