ఒక వ్యాపారాధిపతిగా నా అనుభవం తో మరొక ఉదాహరణ చెప్తాను. మన దగ్గర పూర్తి సమయం పనిచేసే ఉద్యోగులు, పాక్షికంగా పని చేసేవారు, అదనపు గంటలు పని చేసేవారు ఉంటారు. వీరిలో సాధారణంగా మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాము? 2, 3 గంటలు పని చేసేవారిని కాక, హృదయపూర్వకంగా, నవ్వుతూ, సంతోషంగా ఇచ్చిన పనిని పూర్తి చేసేవారిని ఇష్టపడుతూ ఉంటాము. అటువంటి వారి మీద మనం పూర్తి నమ్మకం ఉంచవచ్చు. వారు మిమ్మల్ని ఎటువంటి ఒత్తిడికి గురి చేయరు. వారు సంతోషంగా ఉంటూ పరిసరాలలో కూడా ఆ సంతోషాన్ని ప్రసరింపచేస్తూ ఉంటారు. నిజానికి మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించిన సమయం లో అటువంటి సంతోషకరమైన ఉద్యోగులను కనుక మీరు కలిస్తే, మీరు కూడా సంతోషం పొందుతారు. అటువంటి ఉద్యోగులు, సర్! నాకు ఒక రెండు వారాలు సెలవు కావాలని కోరితే, రెండు వారాలే ఎందుకు, ఒక నెల సెలవు తీసుకొని ఆనందంగా గడిపి రమ్మని మీరు చెప్తారు. అలా ఎందుకంటే, ఒక కుటుంబ సభ్యునిలా పని చేసే ఉద్యోగిని చూస్తే, హృదయంలో ఆనందం కలుగుతుంది.
8 – 10 గంటల సమయం మీరు పనికే కేటాయిస్తున్నారనుకోండి. 8 గంటలు నిద్రకు, 4 గంటలు రాను, పోను సమయం కేటాయిస్తే, మీ పిల్లలకు, మీ జీవిత భాగస్వామికి ఇంక ఎంత సమయం కేటాయించ గలుగుతారు? ఆ కేటాయించిన సమయం లో కూడా మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరందరు కలిసి కూర్చునే ఉంటారు. కానీ మీ ఫోన్ ఆన్ లో ఉంటుంది. మీ భార్య టీవీ చూస్తూ ఉంటుంది. మీ పిల్లలు వారి, వారి కార్య కలపాలలో నిమగ్నమై ఉంటారు. ఇక అక్కడ కుటుంబ జీవితం ఎక్కడుంది?
అలా కాక అందరూ ఒకే సమయంలో లేచి, కనీసం 15 నిముషాల పాటు అందరూ కలిసి కూర్చొని ధ్యానం చేసుకోన్నట్లైతే, మిమ్మల్ని అందరినీ సంఘటితం చేయడానికి ఆ 15 నిమిషాల సమయం చాలు. అందరినీ సంఘటిత పరచే ఒక ప్రత్యేకమైన మార్గం ధ్యానం. అలాగే సాయంత్రం సమయంలో కూడా మీరందరు కలిసి ధ్యానం చేసుకొన్నట్లైతే, ఇంటిలో ఎటువంటి వాతావరణం సృష్టించబడుతుందో ఒకసారి ఆలోచించి చూడండి. ఇంటిలో గడిపే ఆ కొద్ది సమయం నాణ్యమైన సమయంగా మారుతుంది.
అయితే మీరు 8 – 10 గంటలు సుదీర్ఘంగా ఆఫీస్ లో గడుపుతూ ఉంటారు. మరి దాని మాటేమిటి? మీ కుటుంబ సభ్యులతో కన్నా అధిక సమయాన్ని మీరు మీ సహోద్యోగులతో గడుపుతూ ఉంటారు. పని చేసే వాతావరణం కూడా ఆనందకరంగా, నిత్య నూతనంగా, ఉత్పాదకతను పెంపొందించే విధంగా మనం తయారు చేయలేమా? అటువంటి వాతావరణాన్ని ద్వేషిస్తూ, ఇచ్చిన ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉండకూడదు.
ఈ వాయిదా అనే పదానికి ఉత్తమ ఉదాహరణ, భారతదేశంలోని న్యాయ వ్యవస్థ. ఇక్కడ ప్రతిపని వాయిదాలతోనే నడుస్తుంది. వాయిదా వేయడం ఒక్కటే వారికి తెలిసిన పని. ఒక్క వారంలో ఏ కేస్ కూడా పరిష్కరింపబడదు. ఏదైనా ఒక్క రోజులో పరిష్కారం అయ్యిందంటే చరిత్ర తిరగ రాసినట్లే. ఇలా కేసులు అన్నీ పేరుకుపోయి, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటే సహజంగానే ఒత్తిడి వాతావరణం ఏర్పడుతుంది. నిర్ణయాలను ఎలా వాయిదా వేయాలి అని వారు సాకులు వెతుకుతూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక సెకను సమయం చాలు. ముఖ్యంగా కోర్టులు, ఐఆర్ఎస్, ఐఏఎస్ అధికారులకు నిర్ణయం తీసుకోవడానికి ఒక నిముషం కంటే అధిక సమయం పట్టదు. అయితే ప్రజలు పుకార్లు ఎక్కువగా వ్యాపింప చేస్తూ ఉంటారు.
కోర్టు హాలులో రెండు పక్షాల వారి వాదనలు నడుస్తూ ఉన్నప్పుడు వారి, వారి శరీర భాషను, వాదనను బట్టి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఇట్టే పసిగట్టేయవచ్చు. అయితే ఎవరి పక్షాన తీర్పు ఇస్తే మనకి లాభ దాయకంగా ఉంటుంది అని వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒక జీవితానికి సంబంధించి తప్పుడు తీర్పును ఇవ్వాలంటే మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి తీరాలి. అదే సరైన తీర్పును ఇవ్వడానికి పెద్దగా ఆలోచించ వలసిన అవసరం ఉండదు. ఒప్పు ఎప్పుడూ ఒప్పే. నా పేరు శిఖ అని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. ఎందుకంటే అది ఉన్న వాస్తవం. అదే నా పేరు ఎలిజబెత్ అనో, ప్రగ్యా అనో, సంతోషి అనో చెప్తే అది అబద్దం. ఒక అబద్ధం కప్పి పుచ్చడానికి లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది.
సమస్యను వాయిదా వేయకుండా దానికి పరిష్కారం వెదికితే అది అక్కడితో సమసి పోతుంది. కనుక ఏ పనిని వాయిదా వేయకండి.
మీరు ధ్యాన స్థితిలో ఉండి, ప్రశాంతంగా, నిర్మలమైన మనస్సుతో కనుక ఆలోచించినట్లైతే, మీరు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.