“ఏ, ఈ, ఐ, ఓ, యు” గురించి
గౌరవనీయులైన పెద్దలు మరియు సోదరీ సోదరులారా,
సంతోషం అనేది చాలా స్పష్టంగా అనుభూతి చెందుతున్నాము. అది అందరిలోనూ వ్యాపిస్తూ ఉంది. మనందరం సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఒకే కప్పు క్రింద సమావేశం అవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలుగ చేస్తోంది.
మనందరం ఒక అసాధారణమైన విపరీత పరిస్థితులను ఎదుర్కొన్నాము. ఇది మనల్ని భౌతిక, మానసిక ,ఆధ్యాత్మిక ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండేలా చేసింది. మన కుటుంబంలో కొంతమంది తమ ప్రియమైన వారిని కోల్పోయినప్పటికీ, వారంతా పూజ్య బాబూజీ మహరాజ్ గారి కృప వలన, వారి మార్గదర్శకత్వంలో ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని కోలుకుంటున్నారు.
కోవిడ్ లాంటి విపత్తులకు ఇది అంతమా? కాలం గడిచే కొద్దీ ఇది ఇంకా వేగవంతమై తీవ్రతరం అవుతుందని బాబూజీ మహరాజ్ మనకు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సుమారు 60 దేశాల నుండి, ఇండియాలోని మిజోరం తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల నుండి సుమారు 40 వేల మంది హాజరయ్యారు. వీరిలో 8 వేల మంది కొత్తవారు, మొట్టమొదటిసారి ఇక్కడకి రావటం జరిగింది. రేపు రాత్రి 9 గంటలకు ఈ క్రొత్తవారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. దయచేసి గమనించండి, క్రొత్తవారు మాత్రమే!
ఇలాంటి భండారాలు మనల్ని మనం అంచనా వేసుకోవడానికి, మనకు సాధారణంగా అందుబాటులో ఉండని స్థితులను, పరిమాణాలను అందుకోవడానికి ఇవ్వబడిన ఒక చక్కని అవకాశం. గురు పరంపర నుండి వచ్చే కృప ఆ డైమెన్షన్ లోనికి మనల్ని నడిపిస్తుంది. నేను మనకు అందిన ప్రత్యేకమైన భండారా సందేశం గురించి చెప్తూ ఉన్నాను కదా! అదేమీ కొత్త విషయం కాదు. బాబూజీ మహరాజ్ ఎన్నోసార్లు ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తూనే ఉన్నారు.
ఆపై శ్రీకృష్ణ భగవానుడు ఏ, ఈ, ఐ, ఓ, యు అనేది రెండవ ముఖ్యమైన అవసరం అని చెప్పారు. ‘ఏ’ (అక్వైర్) అంటే ఆధ్యాత్మిక స్థితిని అందుకోవడం. ఆధ్యాత్మిక స్థితిని అందుకోనిదే దానిని ఎలా పొందగలం?చాలాసార్లు మనం దాన్ని అందుకుంటాం కానీ అది మన హృదయం లోపల స్థిరపడకుండానే పోగొట్టుకుంటాం. నేను ఉదయం ప్రసంగించిన తర్వాత ఒక అభ్యాసీ చాలా బాధాకరమైన ఈ-మెయిల్ నాకు పంపించారు. మీరు మమ్మల్ని గంటసేపు ధ్యానం చేయమని ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ బాబూజీ కేవలం 2, 3, లేక 5 నిమిషాలు మాత్రమే ధ్యానం చేసేవారు అని ఆ సోదరి ఆరోపణ.
బాబూజీ మహరాజ్ ఒక సాధకునిగా, ఒక అభ్యాసీగా ఉన్నప్పటి విశేషాలు పొందుపరిచిన వారి ఆటో బయోగ్రఫీ పార్ట్-1 దయచేసి సునిశితంగా చదవమని నేను ఆ సోదరికి సూచిస్తున్నాను. ఆ పుస్తకం రేపు అందుబాటులోకి వస్తుంది. ఆ పదాలను అనుసరిస్తూ అర్థం చేసుకోండి. వారు ఆ 2, 3 నిమిషాలలో ఎలాంటి ఆధ్యాత్మిక సంపదను పొందగలిగేవారో, అవి మనం పొందాలంటే కొన్ని గంటలు కాదు…రోజులు ధ్యానం చేసినా సరిపోదు. కాబట్టి దయచేసి మీ సమయాన్ని నిష్ప్రయోజనమైన, నిరర్థకమైన వాదనలతో వృధా చేసుకోకండి.
బాబూజీ అదే కాదు, ఇంకా ఎన్నో చేయగలిగేవారు. కళ్ళు మూయకుండానే వారు తమ హృదయాంతరాళం లోనికే కాక, ఇతరుల చైతన్యం లోనికి కూడా చొచ్చుకుపోగలిగేవారు. మనం ఇతరుల చైతన్యం లోకి ప్రవేశించ వలసిన అవసరం లేదు. అది బాబూజీ మహరాజ్ లాంటి గొప్ప మాస్టర్స్ మాత్రమే చేయగలరు.
గొప్ప గొప్ప యోగులు కూడా లాలాజీ మహరాజ్ సృష్టించిన ఈ అడుగు భాగమే లేని అనంతమైన గొప్ప పాత్ర (బాబూజీ) ను చూసి ఆశ్చర్య పడేవారు. ప్రాణాహుతి ఎంతగా వారిలోకి ప్రవహించినప్పటికీ, అది పూర్తిగా నిండేది కాదు. వారి సాధన ఏ స్థాయిలో ఉండేదో ఆ విధంగా మనం కూడా కృషి చేయాలి. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోండి. మీరు ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక స్థితిని అర క్షణంలో పొందగలిగితే, మిమ్మల్ని ఆ అరక్షణం కంటే ఎక్కువ ధ్యానం చేయమని మేము కోరము.
అలాంటి స్థితులను పొందగలిగితే ఆ విధంగానే ముందుకు సాగండి. లేనట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఈసారి సూచించినట్లుగా ఈ పద్ధతిని పాటించండి. వారు ఈ విధంగా అంటున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నిర్ణీత సమయంలో, ఉదయం ఒక గంట చొప్పున ఒక సంవత్సరం పాటు ధ్యానం చేసి చూడండి. అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళుతుందో గమనించండి.
రెండవ ముఖ్యమైన విషయం, ‘ఏ, ఈ, ఐ, ఓ, యు’. ఆ స్థితిని పొందిన తర్వాత దానికి మన ఎరుకతో, మన ప్రయత్నంతో జీవం పోయాలి. పగలంతా దానిని తీవ్రతరం చేయండి. మీ అందరికీ ఆ స్థితికి జీవం పోయడం (ఎన్లైవనింగ్) ఎలాగో తెలుసు, అయినా మరొక్కసారి చెప్తాను.
ప్రతి ధ్యానం తర్వాత అలాగే ప్రశాంతంగా ఐదు లేక పది నిమిషాలు కూర్చుని, మీరు అనుభూతి చెందిన దాన్ని గుర్తించి రాయండి. ఈ స్థితిని స్వయంగా విశ్లేషించండి. దానితో మమేకమవ్వండి. మనస్సులో ఈ స్థితిని పదిలపరచుకుని మీ రోజు వారీ కార్యకలాపాలలో పాల్గొనండి. ఆఫీసుకు వెళ్ళినా, కొత్త ప్రదేశానికి వెళ్ళినా లేక ఇంట్లో ఉన్నా, మీకు సమయం ఉన్నట్లయితే ఈ స్థితిని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించండి. బాత్రూమ్ కు వెళ్ళినప్పుడయినా ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉండి మీరు ఉదయం పొందిన ధ్యాన స్థితిని గుర్తు తెచ్చుకోండి. అవసరమైతే మాస్టర్ తో మళ్ళీ మళ్ళీ అనుసంధానమై మరింత ప్రాణాహుతి స్వీకరించి ఏ విధంగా కొత్త స్థితి మీ లోనికి దిగి వస్తుందో చూడండి.
ఇలాంటి చిన్న చిన్న ధ్యానాలు మళ్లీ మళ్లీ చేయడం వలన మనం వివిధ స్థాయిల్లోని ఆధ్యాత్మిక స్థితుల్లోకి వెళ్లడానికి సహాయం చేస్తాయి. ఉదయం పొందిన స్థితిని తీవ్రతరం చేయడమే కాక కొత్త కొత్త ఆధ్యాత్మిక స్థితులను మనలో పెంపొందిస్తాయి. కాబట్టి స్థితికి జీవం పోయడం, కొత్త ఆధ్యాత్మిక స్థితితో మన పరిచయం ఈ విధంగా జరుగుతుంది. మీరు మళ్లీ మళ్లీ మాస్టర్ తో అనుసంధానమై గుర్తు తెచ్చుకుంటే, అది ఇంకా ఇంకా తీవ్రతరమవుతుంది. ‘ఓ’, ‘యు’ ఒకటై పోవడం, లయం అవ్వడం, గుర్తింపు కోరని లోతైన ఆధ్యాత్మిక స్థితికి, అదే శూన్యతా స్థితికి దారితీస్తాయి. మళ్లీ మళ్లీ అదే సిద్ధాంతం వర్తిస్తుంది. మనం మాస్టర్ కు గుర్తింపు కోరని సేవకులుగా మారగలిగితే, అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఇది రెండవ చిట్కా. మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను. రేపు మూడవ చిట్కా చెప్తాను.