ప్రేరణ శీర్షిక క్రింద దాజీ గారు ప్రతీ మాసం హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాస పత్రికలో ప్రచురించే వ్యాస పరంపర లో భాగంగా , ఈ మే మాసం లో ఉత్తమ నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు చేస్తూ ఆయన వ్రాసిన వ్యాసం ఆధారంగా ఇది రూపొందించబడింది
బ్యాంకులు గాని మరే ఇతర ఆర్ధిక సంస్థలుగాని తాము అప్పుగా ఇచ్చిన .డబ్బుకి వడ్డీ వసూలు చేస్తాయి. ఆర్ధిక రంగంలో ఇది అనూచానంగా వస్తున్న ఆచారం. వాస్తవానికి పురాణాలలో కూడా వడ్డీ వసూలు చెయ్యడం గురించిన ప్రస్తావన ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కుబేరుడు దగ్గర అప్పుగా తీసుకున్న ధనానికి ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తున్నాడనీ అందుకే ఆయన్ని వడ్డీ కాసులవాడు అంటారనీ పురాణాలు చెప్తున్నాయి. అయితే వడ్డీ గురించి మనకి ఎంతో కొంత అవగాహన ఉన్నా, చక్రవడ్డీ గురించీ, అది ఎలా లెక్క కడతారు అన్న దాని గురించి ,మనలో కొంత మందికి తెలియక పోవచ్చు. వడ్డీ కి వడ్డీ లెక్క కట్టి వసూలు చెయ్యడమే చక్ర వడ్డీ అంటే. “చక్రవడ్డీ గురించి తెలిసిన వాడు బాగా సంపాదిస్తాడు. తెలియని వాడు నష్టపోతాడు ” అని అయిన్ స్టీన్ చెప్పాడు. అసలు ఈ వడ్డీ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అనుమానం రావడం సహజం. చక్రవడ్డీ గురించి తెలియని వాళ్ళు ఎలా నష్ట పోతారో అలాగే సరైన నిర్ణయాలు తీసుకోవడం గురించి అవగాహన లేని వాళ్ళు కూడా జీవితంలో నష్ట పోతారు అంటారు దాజీ.
మన దైనందిన జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం. అందులో కొన్ని కీలక మైనవి కావచ్చు. జీవితాన్ని మలుపు తిప్పేవి కూడా కావచ్చు. అందువల్ల ఆ నిర్ణయాలు సరైనవి అయి ఉండడానికి మనం ప్రయత్నించాలి . అయితే దానికి మనం ఏం చెయ్యాలి? నిత్యం ధ్యానం చేస్తూ ఉంటె కనక సగటున మనం తీసుకునే నిర్ణయాల ఫలితాలు అన్నీ మెరుగ్గా ఉంటాయని సూచిస్తారు దాజీ. ఇది ఒక అధ్యయనం లో నిరూపించ బడింది కూడా.
మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం ఎలా ఉపయోగ పడుతుందో ఇప్పుడు చూద్దాం.
న్యూ యార్క్ లాంటి మహా నగరం ఎలా విస్తరించి ఉందొ అనే దృశ్యం పూర్తిగా కనబడాలంటే ఆ నగరంలోని ఎత్తైన భవనం పైన నిలబడి చూస్తెనే తెలుస్తుంది. అంతేకాని మీ మేడ మీద నుంచి చూస్తె తెలీదు. అలాగే ఒక సమస్య లేక పరిస్థితిని గురించిన సమగ్ర అవగాహన ఏర్పడా లంటే ,మన మనస్సు మీద ప్రభావం చూపే కోరికలు, ఇష్టాయిష్టాలు, భావోద్వేగాలు వీటన్నిటినీ అధిగమించాలి. ఇలాంటి వాటి ప్రభావం నుంచి తప్పించుకోడానికి ధ్యానం సహాయ పడుతుంది. మన హృదయపు లోతుల్లో మన శ్రేయస్సుకు ఉపయోగించే సలహాలు, సూచనలు ఎన్నో లభిస్తాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే ధ్యానం మనకి మార్గం చూపిస్తుంది.. ఆ సూచనలు మన చైతన్యంలో అంతర్భాగంగా ఉండే మాలిన్యాల్ని తప్పించుకుని మన మనస్సుని చేరుకోవడానికి కూడా దోహద పడుతుంది. దీనికి భూమి అంతర్భాగంలో ఉన్న కర్బనం వజ్రంగా మారే ప్రక్రియని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రజల్లో చాలా మంది పక్షపాత బుద్ధితో ఉంటారు. అది మత పరమైనది కావచ్చు, జాతీయత కావచ్చు, లేక శరీర ఛాయ పరమైనది కావచ్చు. ధ్యానం ద్వారా మనం వస్తువుల్ని, మనుషుల్ని వారి యదార్ధ రూపంలో చూడ గలుగుతాం. అందువలన ఏర్పడిన స్పష్టమైన దృష్టితో, అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం వీలు కల్పిస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి కావలసిన సమాచారం అంతా మన ఎదురుగానే ఉన్నా నిర్ణయం చెయ్యలేని సందర్భాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఆందోళనతో చికాకు కలుగుతూ ఉంటుంది. ఇలా నిర్ణయం తీసుకో లేకపోవడానికి కారణం- స్పష్టత లేకపోవడం, మంచి చెడులను విభజించి చూడగల వివేకం లేకపోవడం. మన ఉన్నతికి , మన ఆధాత్మిక పరిణామంకు దోహదం చేసేది ఏమిటి అని తెలుసుకోడానికి అంటే అలాంటి వివేకం కలిగి ఉండడానికి కూడా ధ్యానం ఉపయోగ పడుతుంది.
చివరిగా దాజీ ఏమంటారంటే ధ్యానం ఏ పద్ధతిలో చేసినా పైన చెప్పిన మంచి ఫలితాల్ని ఇస్తుంది. అయినా హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన పద్ధతికి ఒక ప్రత్యేకత ఉంది. అది కోరికల్ని పక్షపాత వైఖరినీ త్వరగా అధిగమించి నాణ్యమైన మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ఉపయోగ పడుతుంది. హార్ట్ ఫుల్ నెస్ పద్ధతిలో హృదయం పైన ధ్యానం చేస్తారు. తద్వారా మనం మన మనస్సు, చైతన్యం వీటిని బాగా అర్ధం చేసుకోగలుగుతాం. చాలా త్వరగా నిర్ణయం తీసుకో గలుగుతాం. ఎందుకంటే మనకి మార్గ దర్శనం మన హృదయం లోంచి వస్తుంది కనక. మరీ ముఖ్యంగా అది ఏం చెయ్య కూడదో చెబుతుంది.
ఒక ఆర్ధిక నిపుణుడు ఏం చెప్పారంటే ఆర్ధిక రంగంలో మనం ప్రిన్సిపల్ అంటే మూలధనం పెట్టుబడి పెడతాం. దానికి ఇంటరెస్ట్ వస్తుంది. ధ్యానంలో ఇంటరెస్ట్ ని పెట్టుబడిగా పెడతాం. దానివలన మనం principled గా తయారవుతాం.
అందువలన మనం ప్రతి రోజూ ధ్యానం చేద్దాం. మంచి నిర్ణయాలు తీసుకుందాం.
నమస్తే.