ప్రశ్న: ఒక్కొక్కసారి ఇతరుల చర్యల వలన మనలో ముద్రలు ఏర్పడుతాయి. వాటిని మనం ఏవిధంగా నియంత్రించవచ్చు?
Q: Sometimes impressions are formed because of others’ actions. How do we control them?
దాజీ: ఈ ప్రశ్న అడిగిన వారు మరింత సున్నితత్వాన్ని అభివృద్ధి చేసుకుని ఉండవచ్చు. సరియైన అవగాహన ద్వారానే ఇది సాధ్యపడుతుంది. నేను దీనికి తరచుగా సీతారాముల గురించిన చక్కని ఉదాహరణను పేర్కొంటాను. దశరథ మహారాజు వశిష్టుడు, విశ్వామిత్రుడు వంటి గొప్ప ఋషులను, సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుల భవిష్యత్తు గురించి సంప్రదించినప్పుడు, వారు వారిరువురు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత ఉత్తమమైన జంటయని, వారి జీవితంలో ఏ విధమైన అపశృతులు ఉండబోవని తెలియజేస్తారు. ఇంకా చెప్పాలంటే వారు అవతారమూర్తులు కనుక వారికి గత జన్మల ముద్రలు, సంస్కారాల భారం అంటూ ఏమీ ఉండదు.
అయినప్పటికీ జీవితంలో జరగకూడని ప్రతి ఒక్కటీ వారి జీవితంలో జరిగింది. వారు అడవులకు వెళ్ళవలసి వచ్చింది. శ్రీరాముడు తన భార్యను విడిచి పెట్టవలసి వచ్చింది. సీతమ్మ వివిధ పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. నిజం చెప్పాలంటే ఇదంతా చాలా నిరాశకు గురి చేసే విషయం. మరి అసలు ఇదంతా ఎవరి వల్ల జరిగింది? వారి విధిని ప్రభావితం చేసింది ఎవరో కాదు, రాముని సవతి తల్లి కైకేయి. ఆమె తన కొడుకు రాజు కావాలని, రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్లాలని కోరుకొంది. ఆమె కొడుకు భరతుడు రాజు కావాలనుకోవడం బాగానే ఉంది, కానీ పాపం ఆ అమాయకుణ్ణి అరణ్యాలకు పంపటం ఎందుకు? ఇది అర్థం కాని విషయం. దశరథ మహారాజు తనకిచ్చిన వాగ్దానాన్ని కైకేయి అసమంజసంగా వినియోగించుకుని లబ్ధి పొందింది. ప్రాణం పోయినా మాట తప్పకూడదనే వారి సంప్రదాయం అర్ధరహితం. రామాయణం అంతా ఈ సాంప్రదాయం వల్లే ఇబ్బందులకు గురి అయింది.
అదేవిధంగా మహాభారతంలో భీష్ముడు హస్తినాపుర సామ్రాజ్యాన్ని రక్షించటం గురించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నందుకు చాలా గర్వించేవాడు. ఆయన కోరుకుంటే పాండవులతో సహచర్యం చేసి రాజ్యాన్ని కాపాడగలిగేవాడు. ఇంకా చెప్పాలంటే మరింత మెరుగ్గా ఈ పని చేయగలిగే వాడు. కానీ అలా చేయలేదు. ఆయన కేవలం సింహాసనానికే విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు, కానీ ఏ ఒక్క వ్యక్తికి కాదు. కాబట్టి ఎప్పుడైతే మీరు చేసిన వాగ్దానం మిగిలిన వారందరికీ సరైన ప్రయోజనకారి కాదని మీరు గ్రహిస్తారో, అప్పుడు ఆ వాగ్దానాన్ని భంగం చేయటంలో ఎలాంటి తప్పు లేదు. నేను నా హృదయాన్ని ఎంత ఉదారంగా, నా మనసును ఎంత అవగాహనతో తయారు చేసుకోవాలంటే, నేనింక ఎంత మాత్రమూ ముద్రలను ఏర్పరచుకోకూడదు.
చాలా సందర్భాలలో ముద్రలు ఏర్పడేది అపార్థాల వల్లనే, అని నేను గమనించాను. ఇతరులు ఎవరైనా ఏదైనా ఛలోక్తి వేసినప్పుడు అది ఒక ఛలోక్తి మాత్రమే అని నేను అర్థం చేసుకోగలగాలి. దాన్ని హృదయం లోకి తీసుకోకూడదు. కొంతమంది ‘నాతో హాస్యం ఆడుతున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారని’ అంటారు. ఇది ఆ వ్యక్తిని గురించిన ముద్రలను ఏర్పరుస్తుంది. ఆ తర్వాత మనం ఆ వ్యక్తితో సత్సంబంధాన్ని కోల్పోతాము. మీలో క్షమించే వైఖరి ఉంటే అప్పుడు మీరు ఏమీ ప్రోగు చేసుకోరు. చెడు విషయాలే కాదు, మంచి విషయాలు కూడా ముద్రలను ఏర్పరుస్తాయి. సంకెళ్లు ఇనుప వైనా, బంగారపు వైనా సంకెళ్లు సంకెళ్లే అని అంటుంటారు కదా! అవునా? వాటిని విడిచి పెట్టేయాలి.
చెడు విషయాలను విడిచి పెట్టడం తేలికైన పనే, కానీ మంచి విషయాలను ఎలా విడిచి పెట్టడం? అవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సంస్కారాలను ఒక్కొక్కటిగా విడిచి పెట్టాలనుకుంటే అది చాలా కష్టమైన ప్రక్రియ అవుతుంది. కానీ బాబూజీ చెప్పినట్లుగా మీ తలను అటు నుండి ఇటు తిప్పినట్లు లేక ఒక చిటికె వేసినట్లుగా లేక లాలాజీ చెప్పినట్టుగా ఒక రెప్పపాటులో… మీరు ఇక్కడినుండి అక్కడికి చేరుకోవచ్చు. మీరు మీ చైతన్యంలో ఒకేసారిగా గొప్ప పురోగతి సాధిస్తున్న ప్రత్యేకమైన ఆ మహత్తర క్షణంలో సంస్కారాలన్నీ ఏమవుతాయి? అవి మీరు సంపాదించినవైనా లేక ఇతరుల వలన మీలో ఏర్పడినవయినా, ఏమవుతాయి?
ఇదిలా ఉంటుంది…నా మనసులో మెదిలే ఉదాహరణ ఏమిటంటే, మీరు ఒక గదిలో చీకటిని ఏ విధంగా పారద్రోలగలరు? కొద్ది కొద్దిగా ఇప్పుడు ఒక లీటరు, ఇంకా కొద్ది సేపటికి రెండు లీటర్లు ఆపై 10 లీటర్లు…ఈ విధంగానా? కానే కాదు! మీరు ఒక స్విచ్ వేస్తే లేక ఒక కొవ్వొత్తి వెలిగిస్తే చాలు, అంతే! మన సాధనలన్ని అటువంటి వెలుగును మన జీవితంలో తీసుకురావడానికే నిర్దేశింపబడ్డాయి. ఈ వెలుగుకు సరిసమానమైనది, మన జీవితంలో ఎరుక మాత్రమే. మీకు ఎరుక కలిగిన ఆ క్షణం లోనే ఈ అంధకారం, సంస్కారాలన్నీ మాయమవుతాయి. సరైన అవగాహనతో, అపరాధ భావానికి సంబంధించిన భారం కూడా కరిగిపోతుంది. అందుకనే మనం తరచుగా ఈ సంకల్పం చేస్తూ ఉండాలి. ‘ప్రపంచంలోని సోదరీ సోదరులందరూ, సక్రమమైన ఆలోచన, సరైన అవగాహన, నిజాయితీ తో కూడిన జీవన విధానం ఈ మూడు విషయాలను పెంపొందించుకుంటూ ఉన్నారు’.
‘నాకు సక్రమమైన ఆలోచన, సరైన అవగాహన ఉంటే నాకున్న సమస్యలన్నీ చాలావరకు తొలగిపోతాయి’. నిజాయితీతో కూడిన జీవన విధానాన్ని అవలంబిస్తే అది ఒక టీకాలాగా పనిచేస్తుంది. మీరు మీ జీవితాన్ని నిజాయితీగా గడుపుతున్నారు, కాబట్టి మీరు ఎలాంటి చెడు ప్రవృత్తులను ఏర్పరచుకోరు. ఈ మూడు సంకల్పాలు మన గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు అవసరమైన భద్రతను కల్పిస్తాయి. సంక్షిప్తంగా సమాధానం చెప్పాలంటే ధ్యానం, నిర్మలీకరణ సాధన చేయటం, కొద్దికొద్దిగానో లేక ఒకే ఒక్కసారిగానో శరణాగతి కావటంతో మీ ఎరుకను అభివృద్ధి చేసుకోండి.