Prerana Pondandi -20

పతంజలి మహర్షి అందించిన అష్టాంగయోగం, ప్రస్తుత కాలంలో ఆచరిస్తున్న యౌగిక సిధ్ధాంతాలు, సాధనాలు, ఇంకా ఈనాటి శాస్త్రీయ పరిశోధనలు దృష్టిలో ఉంచుకొని, అలవాట్లను మెరుగు పరచుకోవడం గురించి దాజీ కొనసాగిస్తున్నారు.
ఇంతకు క్రితం ఆయన చిట్టచివరి ‘యమం’ అయిన ‘అపరిగ్రహ’ ను గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన ‘నియమాల’ పై దృష్టి సారిస్తున్నారు.
‘నియమాలు’ అంటే, సంతుష్ట జీవనం కొనసాగించడానికి అలవరచుకోవలసిన అలవాట్లే. ఇప్పుడు మొదటి నియమం ‘శౌచ’ తో మొదలు పెడుతున్నారు.
మంచి, చెడు అలవాట్లు:
‘యమ’ అంటే, హింస, నిజాయితీ లోపించడం వంటి ‘చేయకూడని’ అంశాలన్నింటినీ తొలగించుకోవడమే.
‘నియమాలు’ అంటే అలవరచుకోవలసిన అలవాట్లు, ఇవి మన మనుగడను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సహాయపడతాయి.
మన జీవితాన్ని సుసంపన్నం చేసి మంచిని, శోభను మనవైపు నుండి ప్రపంచం పట్ల వెదజల్లేది ఈ నియమాలే.
అవి మన హృదయాలను ఉదాత్తమైన గుణాలతో నింపుతాయికూడా. మన బాహ్య, అంతరంగ స్థితులను మరింత సూక్ష్మతరమైన స్థితుల దిశగా మెరుగు పరచుకోవడానికి అవి సహకరిస్తాయి.
ఇంకా, ప్రకృతికి అనుగుణమైన జీవనశైలిని అనుసరించడానికి దోహదపడతాయి. మానవజాతికి, భూగ్రహం మనుగడకు కచ్చితంగా కావలసినది కూడా అదే.
ప్రకృతిలో మనకు ఒక అద్భుతమైన క్రమం కనిపిస్తుంది. అదేమంటే, మన లక్ష్యం ఉన్నతంగా జరుగుతున్నకొద్దీ, దాని సాధన కోసం, మనలో మరింత ఉన్నతమైన క్రమం కూడా ఆవశ్యకమవుతుంది.
ఇప్పుడు, మనం ముందుకు దూసుకుపోయే విధంగా మనలను ప్రేరేపించగల అయిదు సానుకూలమైన అలవాట్లు ఏమిటో చూద్దాం:
శౌచ : శారీరక, మానసిక స్వచ్ఛత
సంతోష్ : సంతుష్టి, అంతర్గత ఆనందం
తపస్ : తపస్సు, మలినాల నిర్మూలన
స్వాధ్యాయ : స్వీయ అధ్యయనం, ఆత్మగతమైన అభ్యాసం
ఈశ్వర ప్రణిధాన్ : దైవానికి శరణాగతి చెందడం
వీటిని గురించి వివరంగా రాబోయే ఎపిసోడ్స్ లో వివరంగా తెలుసుకుందాం.