దివ్యలోకం నుండి బాబూజీ అంగీకారం అనే విషయం గురించి చెప్పారు అని చెప్పడం తేలికే.
ఎవరైతే మన మాధ్యమం – ఈ సందేశాలను అందుకుంటూ ఉండేవారో, ఆమెతో బాబూజీ మాట్లాడుతూ ఉండేవారు.
ఆవిడ తన ఆరోగ్యరీత్యా సంవత్సరాల తరబడి తను ఉంటున్న అపార్ట్మెంట్ నుండి కనీసం బయటకు కూడా రాగలిగేవారు కాదు.
వీల్ చైర్లో కూర్చొని కూడా రాలేని పరిస్థితి. ఏంటి నాకు ఈ పరిస్థితి బాబూజీ?
కనీసం ఒక రోజు పాటు అయినా నాకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించండి! అని ఆమె బాబూజీ ని వేడుకొనేవారు.
దీన్ని నువ్వు అంగీకరించి తీరవలసిందే! అని బాబూజీ ఆమెను సముదాయిస్తూ ఉండేవారు.
అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ నీకు నీ బాధ నుండి ఉపశమనం లభించడం లేదు. ఇంకా ఉపశమనానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
దీనిని నువ్వు అంగీకరించి తీరవలసిందే అని బాబూజీ ఆమెను సముదాయిస్తూ ఉండేవారు. పరిస్థితి మరింత కఠినంగా మారి…
ఆమెకు ఆమోదించడం మరింత కష్టంగా మారుతున్నప్పుడూ…
నువ్వు దీనిని అమోదించవలసిందే. అది కూడా, ఆనందంగా ఆమోదించక తప్పదు అని బాబూజీ ఆమెకు చెప్తూండేవారు.
మనం మానవులం. అందులోనూ అసంపూర్ణ మానవులం.
కుటుంబ విషయానికి వస్తే, నా భార్యతో వాగ్వాదం ఏర్పడినప్పుడు ఒక్కోసారి నా వైఖరి కఠినంగా ఉండవచ్చు.
మరోసారి ఆమె వైఖరి కఠినంగా ఉండవచ్చు. నేను చెప్పింది ఆమె ఆమోదించాలా లేక ఆమె చెప్పింది నేను ఆమోదించాలా?
ఆమె చెప్పినదానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి నేను ఎలాటి చర్యలు చేపట్టాలి? అలాంటి చర్య సత్ఫలితాలను ఇస్తుందా?
అసలు చర్య తీసుకోవడం మంచిదేనా? లేక ఇక ఆమెలో మార్పు తీసుకు రావడం అసాధ్యం అని భావించి ఆ పరిస్థితులను ఆమోదించడమేనా?
అలాంటి తీర్మానం తీసుకున్న తర్వాత ఇక హృదయంలో అంతా ప్రశాంతతే. అది కష్టమైన విషయమే!
యదార్థ జీవన పరిస్థితులలో అలా అంగీకరించడం ఎంత కష్టమైన విషయమో కూడా నాకు తెలుసు.
అయితే మార్గాంతరం లేదు. క్లిష్టపరిస్థితులను అంగీకరించవలసిందే. అలా కాని పక్షంలో ఇక మిగిలేదంతా వేదనే.
ఆ వేదన ఆలా కొనసాగుతూనే ఉంటుంది.
అలాగే దాని నుండి మనం నేర్చుకోగలిగేది కూడా ఏమీ ఉండదు.
ఇంతకాలం మనం పరిస్థితులను తిరస్కరిస్తూ వస్తున్నాం. అలా కాక ఒకసారి పరిస్థితులను అంగీకరించగలిగితే…
ఇకపై చెయ్యవలసిన దాని గురించి ఆలోచిద్దాం అని అనుకోగలిగితే…
ఏదో ఒక విధమైన పరిష్కారం లభిస్తుంది.
అలా కాకుండా, ఆమెకెంత ధైర్యం అనుకుంటూ, తిరస్కరిస్తూనే ఉన్నామంటే అది పరిష్కారం లేని సమస్యగానే మిగిలిపోతుంది.
ఫలితంగా చేదు అనుభవాలే మిగులుతాయి.
ఏ విధంగా అయితే నేను బలహీనుణ్ణి, అపరిపూర్ణుడినో, ఎదుటి వ్యక్తి కూడా అంతే అన్న విషయాన్ని ముందుగా అర్ధం చేసుకోవాలి.
ఇద్దరూ అపరిపూర్ణులే అయితే ఇక అక్కడ అంతా గందరగోళమే. అయినా పర్వాలేదు.
కొంత మార్జిన్ ఉంచుకోండి. భారతదేశంలో ఈ విధంగా మార్జిన్ వదలడం మామూలే.
ఏదైనా నోట్స్ వ్రాసేటప్పుడు కొంత మార్జిన్ వదలమని మన టీచర్లు మనకు చెప్తూంటారు.
మనతో సహా ప్రతి ఒక్కరి జీవితంలో లోపం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది.
మనలోనో, ఎదుటివారి లోనో లోపాన్ని గమనించినప్పుడు మాత్రమే, అవి హైలైట్ చేయబడతాయి.
నా పిల్లల చిన్నతనంలో వారిని నా ఛాతీపై పడుకోబెట్టుకొని ఆడిస్తూ ఉండేవాడిని.
ఒక్కోసారి వారు నీళ్ళు తాగి, నా మొహమ్మీద కూడా చిలకరిస్తూండేవారు. ఆ చర్య నాకెంతో ఆనందాన్నిచ్చేది కూడా.
అయితే ఎవరైనా అపరిచితుడు అలాంటి పని చేస్తే మీరు అంతే ఆనందంతో ఆ చర్యను ఆమోదించగలిగేవారా?
నా కొడుకు ఇలా చేశాడు. అది నాకెంతో ఆనందాన్నిచ్చింది అని గర్వంగా ఇలా నలుగురిలో చెప్పినట్లు…
మనం ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించగలిగితే,అంతగా ఎదుటి వారి తప్పులను మన్నించగలుగుతాం.
కళ్ళు మూసుకొని వారి తప్పులను చూసీ చూడనట్లు వదలి వేస్తాము.
మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నాం అనడానికి అంగీకారం ఒక్కటే సాక్ష్యం. థాంక్యూ!